Friday, September 14, 2018

ప్రార్థన

చల్లని మంచు బిందువుల వర్షంలో
నీ అర్చనకై సంతోషంతో
విచ్చుకున్న సుమాన్ని నేను..

నీ ఉచ్వాసంతో కలసి,
నీ హృదయ మందిరాన నా పరిమళాన్ని వెదజల్లి,
అక్కడే ఉండాలని ఆశించినా,
నీ నిశ్వాసం ద్వారా బయటకు పంపేయాలని
ప్రయత్నిస్తున్నావు..

నీ ప్రేమ రాగమాలికలో నేనొక
స్వరమాధురినై పులకరించాలనీ,
నా జన్మ తరించాలనీ ఆశ ...

కానీ...

ఎవరు నన్ను కోసి, నీ సేవకు
నోచుకోకుండా చేస్తారో అని
నా బాధ....!
అందుకే...
ఆకుల చాటున...
ఎవ్వరి కంటా పడకుండా...
నీకోసం ఎదురుచూసి,
ఎండలో వడలిపోయాను

సాయంత్రానికి నీ దరి చేరలేక,
బాధాతప్త హృదయంతో..
నేల రాలాను...
కనీసం నీ సుతిమెత్తని
పాదాలకిందైనా...నలిగి,
నా జన్మ సార్ధకం కావాలని,
ఆశగా ఎదురుచూస్తూ...
నిన్నందుకోవాలని
పడే ఆరాటాన్ని తెలుపలేని..
మూగ జీవిని...

కానీ...

అంతలో హోరుగాలి
నన్ను ఎక్కడికో తీసుకుపోయి,
నన్ను విచ్ఛిన్నం చేస్తుందని భయం...

మరు జన్మకైనా...
నన్ను,
నీ పాదాలను ముద్దాడే..
మంత్రపుష్పం కానివ్వు...

No comments: