గది అంటే గదే అనుకునేరు..
నా మదిలాంటి ఎల్లలు లేని పార్క్ , పచ్చిక పరచుకుంది,
ఆ పార్క్ లో ఒక మూల..
"ఏం చేస్తున్నారు?" మొదటి కాగితం మీద ఏవో కొన్ని వాఖ్యాలు రాస్తుంటే..
సన్నగా వినిపించింది.. నా నిశ్శబ్దాన్ని రవళిస్తూ .. ,
మది నిండా ఊహలున్నా .. మూగబోయిన మృదు వేణువుకు..
పెదవి అంచున జాలువారిన కన్నె ఊపిరి ప్రాణమైనట్టు...
"మునివేళ్లతో కలలు కంటున్నాను" .... వెన్నెల ముచ్చటగా నవ్వుకుంటూ ఎదురుగా కూర్చుంది...
ఆమె పేరు ఏదన్నా కావొచ్చు.. నాకు మాత్రం వెన్నెల.. , అంత మనోహరంగా ఉంటుంది..
"మీరెప్పుడూ ఇలానే మాట్లాడతారా?" .. ఆ కనీ కనిపించకుండా.. మాయమయ్యే చిరునవ్వుని.. మరలా ప్రసాదిస్తూ...
"అవును.. మాటలకు రెక్కలుకట్టి ఎగరేస్తాను" నా కాగితం వైపు నేను చూసుకుంటూ.., మనసు మాత్రం ఆమెనే చూస్తోంది..
"ఏవిటీ? చిన్నపిల్లలు గాలిపటాలు ఎగురవేసినట్టా?" - పెదవులమీది చిరునవ్వు పంచిన ఊపిరి ఆవిరి కళ్ళల్లో చూపిస్తూ..
"గాలిపటాలు తిరిగొస్తాయి... నా మాటలకు అలంటి బాధ్యతలుండవు..!" ఇంకా కాగితం మీదే ఆమెని వెదుకుతున్న నా కళ్ళను తీసి ఆమె వొళ్ళో పెట్టాలనుకునేలా ...
"మీ మాటలు నాకు సగమే అర్థమవుతాయి, అయినా వినాలనిపిస్తుంది.. ఎందుకంటారు?" ఆమె కళ్ళు నా కాగితం మీద అప్పటికే నేను రాసుకున్న ముత్యాలను ఆర్తిగా వెతికేస్తున్నాయని తెలుస్తోంది..
"వెన్నెల ఎప్పుడూ భూమిని సగమే చూస్తుంది." ఆమెకి తెలీదు ఆమె కి నేను పెట్టుకున్న పేరు వెన్నెల అని.
"ఇంతకీ ఏమిరాసారో కవిగారు?" వెండి గిన్నెలో కలిపిన పాలబువ్వలా.. చిరునవ్వుకు చిలిపిదనం కలిపి, మొదటి కాగితం తియ్యబోయింది.. అతి కష్టంగా కాగితం మీదే ఇంకా నిలిపిన నా కళ్ళకు తన మృదువైన వేళ్ళ నాజూకుతనం తళుక్కున మెరిసింది..
"అక్షరాలను.. తీగమీద కూర్చున్న.. పాలపిట్టల్లా పొదిగాను... చదవకు... ప్రేమతో నిమరు".. ఇంకా ఆ వేళ్లవైపే చూస్తూ...
ఆమె నిర్మలంగా నావైపు చూసింది.. ఇక నా కళ్ళు, ధైర్యం అంతా కూడగట్టుకుని ఆమె వైపు తిరిగాయి.. ఇంకా కష్టపడి ..
"అదిగో! అలాంటిమాటలే నాకు ఇష్టం... ఎలా వొస్తున్నాయి మీకు?" నా కళ్ళనిండా పండువెన్నెల కురుస్తోంది... నిర్విరామంగా...
ఆమె కి ఎలా చెప్పాలి?
వెన్నెల చూస్తోన్న చూపుల్నే కాదు,
మాటల్ని కూడా మార్చేస్తుందని..
వెన్నెట్లో.. కన్నీటి బిందువులు కూడా నవ్వుతాయని?
సన్నజాజులు కూడా అలాంటివే..
చీకటి కురుల్లో నవ్వులు తురుముకోవటం కన్నా అనుభూతి ఏం ఉంటుంది?
ఇవన్నీ చెప్పలేను, భయం...
భయాన్ని ఏకొద్దిగానో పక్కనపెట్టి,
పైకి చెప్పినమాటలకే.. నా వెన్నెల మురిసిపోతోంది..
ఇక పూర్తిగా మాటాడగలిగితే....?
"తెల్లారటం మామూలే
అందరితో పాటు నేనూ నిద్ర లేస్తాను...
వెన్నెల రావటమే ముచ్చట..!!
అందరూ నిద్రించేటపుడు
నేనొక్కడినే మేల్కొంటాను...
పొద్దు మాటకారి,
వెన్నెల పరమ మౌని..!!!"
ఆమె చదివింది...
ఆగి, ఆగి, నా వైపు చూస్తూ..
"ఇది కూడా సగమే అర్థమయ్యింది, ఐనా నచ్చింది.." అని తన మృదువైన వేళ్ళతో నాకిచ్చేసింది..
కాగితం తీసుకుని, మునివేళ్ళని నాకిచ్చేస్తుందననుకున్నాను .. కానీ నిరాశే...
"ఏవిటీ? కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి?" ఆత్రంగా అడిగింది వెన్నెల..
"ఆహా ఏమీ లేదు, కాస్త జలుబు చేసింది, సీజన్ చేంజ్ కదా.. మామూలే.." కంటిలోని చెంగలువలు వెన్నెలకోసం ఎదురుచూస్తున్నాయి ఇన్నాళ్లూ.... అని ఎలా చెప్పను?
"అయ్యో అలాగా.. జ్వరం అదీ ఉందా?" అర చేతినిండా ప్రేమను నా నుదిటిమీద ఉంచింది..
"కొంచం ఏమిటి ? కాలిపోతోంది.." వెన్నెల నా శరీరమంతా ప్రవహించింది.. బహుశా జ్వరం తగ్గిపోయి ఉండాలి.. ఇంకాస్త జ్వరం వొస్తే బాగుణ్ణు, అరచేయి మరికాసేపు వుణ్ణేమో ..
"ఏయ్ ఇక్కడ ఉన్నావా? కౌంటర్ క్లోజ్ చేసేస్తారు టైం అయిపోతోంది పదా.." వెన్నెల స్నేహితులనుకుంటా ఎండను మోసుకొచ్చారు...
కలం కదిలితే ఒట్టు ... మల్లెపూవులాంటి తెల్ల చీర కట్టుకున్న సన్నజాజి నా కళ్ళముందునుంచే కదిలి వెళ్ళిపోయింది...
సాయంత్రం అయింది.. ఎలాగోలా ఇంటికి చేరుకున్నా..
కాస్త చీకటి పడ్డాక చిరుజల్లులు మొదలయ్యాయి...
మేఘాలు కమ్ముమున్న ఆకాశం కూడా వెన్నెల్ని దాచేసింది..కానీ వెన్నెల ఊహలు మనసుని కమ్మేస్తున్నాయి...
మళ్ళా ఇందాక మధ్యలో ఆపేసిన కాగితాలు, కలం తీసాను ...
ఎక్కడో మువ్వల చప్పుడు,
రిక్షాకి మువ్వలు కట్టారెవరో...
తనజాడ సంగీతాబద్దంగా తెలియటానికి...
పక్కింటివాళ్ళు సినిమా నుంచి వొచ్చినట్టున్నారు అనుకున్నాను..
కానీ ఒక చిన్న కల... "ఈ వేళప్పుడు నా వెన్నెల వొస్తే ఎంతబాగున్ను.." ....మేఘావృతమైన ఆకాశం ఎదురుగా ఉంటే.. వెన్నెలేం కురుస్తుంది?... అనుకుంటూనే తలుపు తీశాను....
వెన్నెలే...!! పండువెన్నెలే ...!! కురుస్తోంది గుమ్మం ముందు ...
"లోపలికి రా,.. వర్షం పడుతోంది... " వెన్నెల వర్షం లో తడిచిపోతోంది...
"జ్వరం కదా.. కాస్త చారు, అన్నం తెచ్చాను.. వేడి గా తింటే తగ్గుతుంది..."లోపలి వొచ్చి, చీర కొంగులో దాచిన సంచిలో కారియర్ ని బయటకు తీసి టేబుల్ మీద పెట్టింది.
"సర్లే తింటాను..."...వెన్నెల్లో అమ్మ కనిపించింది....
ఆ సంచిలోచే.. టీ తీసి ఓ కప్పులో పోసి నాకిచ్చింది..
అప్పటికే.. నేను నాకాగితాలు, కలం పట్టుకుని, వరండా చివర మీది మెట్టుమీద కాలు పెట్టి కూర్చున్నాను..
చినుకుల వల్ల తడిచిన వెన్నెల భుజాల నిండా చీర కొంగు కప్పుకుని, మరో కప్పు టీ తో నా పక్కనే కూర్చుంది...
మా ఇద్దరి పాదాలూ వాన చినుకుల తుంపర్లలో కొద్ది కొద్దిగా తడుస్తూన్నాయి.. మా ఇద్దరి మనసులూ ఒకరికి తెలియకుండా ఒకరికి.. బరువెక్కుతున్నట్టు...
ఆమె ఏవేవో చెప్తోంది.. ఆకాశంలో మేఘాలున్నా.. నా మనసు నిండా వెన్నెల కురుస్తోంది...

No comments:
Post a Comment