Friday, July 18, 2008

సన్నజాజి....

అవి నా కౌమారపు తొలిదశలు అనుకుంటా.. కాలేజీ చదివే రోజులు.. మా అన్నగారి ఇల్లు ఉండే కాలనీలో ప్రతి ఇంటికీ ఫెన్సింగ్ చిన్న పొడుగాటి మొక్కలు, పూతీగెలు ఇత్యాదివి పెంచేవారు..

మా పక్కింటి వాళ్ళింటి ఫెన్సింగ్ కి ఈ సంపంగె తీగలు అల్లుకుని ఉండేవి.. నా కొంపముంచటానికి
వేసవి సాయంత్రాలలో ఆ సన్నజాజులు అలా కిమ్మనకుండా వాటి బతుకేదో అవి బతకకుండా..
నా బతుకేదో బతుకుతున్న నన్ను చూసి, కౌమారుడిని కాస్త కవ్వించాలనుకున్నాయేమో... వాటి మేని సుగంధం కాస్త అలా నావైపు వీచే గాలిలో చిలికించేవి...
ఈ పిల్లగాలి ఇంకా కొంటెది .. నన్ను ఆటపట్టించటానికి సన్నజాజులతో కూడినట్టుంది
 ఒయ్యారంగా నావైపు వొచ్చేది.. సన్నజాజుల మేని గంధం మోసుకుంటూ...
నామటుకు నేను కోమారపు కవ్వింతల గోల భరించలేక సతమవుతూ ఉంటే.. నా చుట్టూ చేరి, నన్నుకవ్వించి, గిలిగింతలు పెట్టి, గోలచేసి, ముక్కుపుటాలలో చేరి.. అక్కడ ఆగకుండా.. మెదడుకి చేరి.. మనసంతా అల్లకల్లోలం చేసేసేది..
అయినా ఏం చేయను.. నిమిత్తమాత్రుడను.. సన్న జాజులు మరీ అంత గుభాళించాలా? ఈ జాలిలేని పిల్లగాలి కూడా నా మీద కరుణించకుండా.. ఆ పరిమళాన్ని నను చేర్చాలా.. ?
అలా పరిచమైన ఆ సౌగంధపు అనుభూతి అక్కడ అలా నిక్షిప్తం అయిపోయింది..

తర్వాత ఎప్పుడు పూల బజారుకి వెళ్లినా.. స్త్రీ అలంకరించుకున్నా.. (నిజం చెప్పొద్దూ.. గుబాళింపు నను తాకితేనే) అటుతిరిగి చూసేవాడిని... సన్నజాజులే అందం..
అలా సన్నజాజులు పరిచయం చేసిన క్షణపు అందాలెన్నో..

ఆశ చావక, బజారులో సన్నజాజులు అమ్మే ఆమెదగ్గర ఓ మూరెడో, బారెడో కోనేసేవాడిని.. కానీ వాటితో ఏం చేసుకోను? ఎవరన్నా చూస్తే.. అన్యదా భావిస్తారేమో.. ఇంటికి తీసుకెళ్లి, మా అమ్మకి ఇచ్చేసేవాడిని..

పెళ్లయ్యాక, శ్రీమతికి వాటిని పెట్టి, రోజంతా వాటితో అచ్చిక బుచ్చికాలాడాలనుకునే వాడిని.. కానీ అమెరికా వొచ్చాక, వొచ్చిన భార్య... సన్నజాజులెక్కడ దొరుకుతాయి? మా ఆవిడే.. నా... సన్న జాజి.

No comments: